కంటైనర్‌ హైజాక్‌?

  • In Crime
  • February 8, 2019
  • 934 Views
కంటైనర్‌ హైజాక్‌?

విలువైన పరికరాల లోడుతో ఓ కంటైనర్‌ మండలంలో గురువారం ఉదయం హఠాత్తుగా ప్రత్యక్షమైంది. వివరాలు.. మండలంలోని పలమనేరు–బెంగళూరు జాతీయ రహదారిలోని అటుకురాళ్లపల్లెకు వెళ్లే దారికి ఆనుకుని అటవీ ప్రాంతం ఉంది. అక్కడ పొదల చాటున సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన ఏసీలు, వాషింగ్‌ మెషిన్ల లోడుతో ఓ కంటైనర్‌ ఉండటం గ్రామస్తుల దృష్టికి వచ్చింది.లారీ నిండా విలువైన వస్తువులే ఉండటంతో బుధవారం రాత్రి కొందరు దుండగులు హైజాక్‌  చేసి వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తుల సమాచారంతో సీఐ, ఎస్‌ఐలు అక్కడికి స్థలానికి చేరుకుని పరిశీలించారు. కంటైనర్‌ వెనుక భాగాన ఒక పక్క డోర్‌కు ఏర్పాటు చేసిన ప్రెసింగ్‌ లాక్‌ను కట్టర్‌తో కట్‌ చేసి లోపలి వస్తువులను దొంగలించేందుకు యత్నించడంతో నేలపై అవి పడిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. కంటైనర్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోకపోవడంతో జీపీఎస్‌ ద్వారా అది ఉన్న ప్రదేశాన్ని యజమానులు గుర్తించారు.అక్కడికి చేరుకున్నారు. పోలీసులను కలిశారు. తమిళనాడు  చెన్నై నుంచి సామ్‌సంగ్‌ కంపెనీలో వస్తువులను లోడ్‌ చేసుకుని అహ్మదాదాబాద్‌కు బుధవారం కంటైనర్‌ బయలుదేరినట్లు చెప్పారు.

లారీ డ్రైవర్‌ అదృశ్యం
కంటైనర్‌ డ్రైవర్‌ లేకపోవడంతో ఇది మిస్టరీగా మారింది. పోలీసుల పరిశీలనలో డ్రైవర్‌ సెల్‌ ఫోన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కంటైనర్‌లో ఉండటం గుర్తించారు. లైసెన్స్‌లో సిద్రామప్ప నారేగల్‌గా పేరు నమోదైంది. ఒకవేళ అతనే ఇలా కంటైనర్‌ను దారి తప్పించి, చోరీకి వీలుకాకపోవడంతో  వదిలి వెళ్లాడా? లేక మరెవరైనా ముందుగానే స్కెచ్‌ వేసి, దీనిని హైజాక్‌ చేసి ఇక్కడికి తీసుకువచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, లారీ, కింద పడిన వస్తువులు, ఉపయోగించిన కట్టర్‌పై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు దీని మిస్టరీ ఛేదించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos