ఐఫోన్‌ అమ్మకాలు తగ్గడానికి అదే కారణమట

  • In Money
  • January 30, 2019
  • 925 Views
ఐఫోన్‌ అమ్మకాలు తగ్గడానికి అదే కారణమట

శాన్‌ఫ్రాన్సిస్కో: గత కొంతకాలంగా భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇందుకు కారణం లేకపోలేదని చెబుతున్నారు యాపిల్‌ సీఈవో టీమ్‌ కుక్‌. భారత్‌ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. డాలర్‌ విలువ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ తదితర అనేక కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ విక్రయాలు పెరగట్లేదని కుక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.  కంపెనీ ఆదాయ వ్యయాలపై కుక్‌ మంగళవారం మార్కెట్‌ విశ్లేషకులతో మాట్లాడారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐఫోన్‌ ఆదాయం 15శాతం తగ్గింది. దీనికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి.. అమెరికా డాలర్‌ విలువ బలపడుతుండటం. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ విలువ పెరగడంతో మా ఉత్పత్తుల ధర పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ధరల మోత ఎక్కువగా ఉంటోంది. దీంతో కస్టమర్లు ఐఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదు’ అని కుక్‌ చెప్పుకొచ్చారు.తమ కంపెనీ అందిస్తున్న బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ కూడా విక్రయాలు తగ్గడానికి ఒక కారణమని ఆయన అంటున్నారు. ‘లక్షల మంది కస్టమర్లకు మేం బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్‌ చేస్తున్నాం. దీంతో కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఎక్కువ కాలం వాడుతున్నారు’ అని కుక్‌ వివరించారు. అయితే విక్రయాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని కుక్‌ తెలిపారు. చైనాలో ఐఫోన్‌ ధరలు తగ్గించామని, భారత్‌లోనూ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos