వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి లోకేశ్ అన్నారు. వైసీపీకి 23 ఎంపీ స్థానాలు వస్తాయంటూ తప్పుడు సర్వేలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2014లో టీడీపీ ఓడిపోతుందని చాలా సర్వేలు చెప్పాయని..కానీ గెలిచామని లోకేష్ గుర్తు చేశారు. కేంద్రమంత్రులే ఏపీ పని తీరు బాగుందని కితాబులిస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర నేతలకు రాష్ట్రాభివృద్ధి కనిపించడం లేదని లోకేశ్ విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాలసీ ప్రకారమే భూముల కేటాయింపులు జరుగుతాయని, రూ.5 కోట్లకు ఎకరం ఇస్తే పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని లోకేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి భూమి కేటాయించినప్పుడు కూడా విమర్శించారని లోకేశ్ తెలిపారు. కాగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి తోమర్‌ను కలిసిన లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. మెటీరియల్, వేతనాల కింద కేంద్రం రూ.2138 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 346 కరువు మండలాల్లో 150 రోజుల పనిదినాలకు కేంద్రం అనుమతించాలని తోమర్‌ను కోరినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.