ఏపి కాంగ్రెస్ లో విచిత్ర ప‌రిస్థితి.

ఏపి కాంగ్రెస్ లో విచిత్ర ప‌రిస్థితి.

పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణ‌యాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీల‌కు వ‌రంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా ప‌రిణ‌మిస్తుంటుంది. తెలంగాణ విభ‌జ‌న నిర్ణ‌యం కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నా, ఏపిలో మాత్రం ఆ పార్టీని, పార్టీనే న‌మ్ముకుని ఉన్న నేత‌ల‌ను కోలుకోని దెబ్బ‌తీసింది. పూర్తి స్థాయిలో ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్ల‌లేక, పార్టీ కార్యాల‌యాల్లో గ‌డ‌ప‌లేక ఏపి కాంగ్రెస్ నేత‌లు అయోమ‌య స్థితిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అన్నిటిక‌న్నా ముఖ్యంగా రాబోవు ఎన్నిక‌ల‌ను ఎలా ఎదుర్కోవాలి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే విష‌యం పై స్ప‌ష్ట‌త లేక నేత‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ఎన్నిక‌లంటేనే ఆ పార్టీ నేత‌లు వ‌ణికిపోతున్న‌ట్టు స‌మాచారం.
ఏపి కాంగ్రెస్ లో అయోమ‌యం..!
ఎన్నిక‌లంటే భ‌యం భ‌యం..!! విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో పటిష్టంగానే ఉన్నా.. ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే, ఏపీలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో అక్కడ ఒక్క నియోజకవర్గంలోనూ ఆ పార్టీ విజయం సాధించలేదు. అంతేకాదు, ఆ పార్టీలో కీలక నేతలుగా మెలిగిన చాలా మంది డిపాజిట్లు కోల్పోయారు. దీంతో ఏపిలో కాంగ్రెస్ పార్టీ కష్టాల క‌డ‌లిలో కాలం వెళ్ల‌దీస్తోంది.
శాప‌గ్ర‌స్తంగా మారిన అదిష్టానం నిర్ణ‌యాలు..!
ఒంట‌రైన ఏపి కాంగ్రెస్..!! అయితే, కొద్దిరోజుల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూటిలోకి రావడంతో ఆ పార్టీ జీవం పోసుకుంటుందని అంతా భావించారు. దీనికి తోడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉండడంతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం ఖాయమనే చ‌ర్చ జ‌రిగింది. తీరా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లేదని తెలిసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీకి అనుకోని కష్టం వచ్చింది.
ఒకవైపు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఓటమి పాలైన కీలక నేతలందరికీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పలువురు అధిష్ఠానం వద్ద ఒక మాట వేసి ఉంచిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వస్తున్న వార్తలు కూడా ఇదే విష‌యాన్ని నిర్ధారిస్తున్నాయి. కానీ, అదే సమయంలో ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి మాత్రం భిన్నంగా త‌యారైంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అక్కడి కాంగ్రెస్ నేతల్లో మాత్రం నిస్తేజం కనిపిస్తోంది.ఇన్నాళ్లూ టీడీపీతో పొత్తు ద్వారా ఎన్నో కొన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవచ్చన్న నాయకుల ఆశలపై నీళ్లు చల్లుతూ, ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు పార్టీ పెద్దలు ప్రకటించడం, ఆశావాహులంతా వెనక్కి తగ్గుతున్న‌ట్టు తెలుస్తోంది. గతంలో టికెట్ కావాలని ఏపీసీసీ దగ్గర దరఖాస్తు చేసుకున్న వారు సైతం యూ టర్న్ తీసుకుంటున్నారని స‌మాచారం. పార్టీనే ఖర్చు పెట్టినా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయమని కొందరు నేతలు బ‌హాటంగానే చెబుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీ మ‌నుగ‌డ ఏంట‌ని ఆ పార్టీ నేతలు మధనపడుతున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తానికి ఏపి కాంగ్రెస్ పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎన్నిక‌లంటే ఆ పార్టీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నంత‌గా ఏ పార్టీ నేత‌లు కూడా భ‌య‌ప‌డ‌టం లేద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos