ఏం కావాలన్నా.. యూట్యూబ్.. నేటి యువత తీరు ఇది..!

ఏం కావాలన్నా.. యూట్యూబ్.. నేటి యువత తీరు ఇది..!

ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌’ ఎంత? జీడీపీ గణన సూత్రం ఏమిటి? ఈక్వేషన్లు, ఫార్ములాలూ రాకపోయినా… గణితమైనా… అర్ధశాస్త్రమైనా… అర్థం కానిదేదైనా ఇప్పుడు యువత చిటికెలో నేర్చేసుకుంటోంది. ‘స్మార్ట్‌’ఫోన్‌ యుగంలో యూట్యూబ్‌నే తమ తరగతి గదిగా మార్చేసుకుని… సబ్జెక్ట్‌ను ఒంటబట్టించుకుంటోంది. ప్రతిదీ టీచరే చెప్పాలని కాకుండా… నెట్టింట పాఠాలు వల్లెవేస్తూ సక్సెస్‌ వైపు అడుగులు వేస్తోంది. గూగుల్‌లో మార్చి 2018లో అన్నింటి కంటే ఎక్కువగా వెతికిన పదం ‘ఎగ్జామ్స్‌’. అంటే పరీక్షల సమయంలో ఎంత మంది భారతీయ యువత ఇంటర్నెట్‌ను ఒక సాధనంగా చేసుకొంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు… గత ఏడాదితో పోలిస్తే యూట్యూబ్‌ లెర్నింగ్‌ చానల్స్‌ చూస్తున్న వారి సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది. ఇది యూట్యూబ్‌ ఇండియా ఇచ్చిన నివేదిక. అదే స్థాయిలో యూట్యూబ్‌లో విద్యా సంబంధిత కంటెంట్‌ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ లెక్కన ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమనుకున్న యూట్యూబ్‌… నేర్చుకోవాలనుకొనేవారికి ఓ కీలక వేదిక కావడానికి ఇంకా ఎంతో కాలం పట్టదన్నది నిపుణుల మాట. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి నేటి తరం ఉపయోగించుకుంటోంది. ఎవరికి ఏం కావాలన్నా…రెండుళ్లుగా ఈ ట్రెండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా టాప్‌లో ఉన్న ఇంగ్లిష్‌ చానల్స్‌ను బీట్‌ చేసి హిందీ భాషలో ఉన్నవాటికి హిట్స్‌ బాగా వస్తుండటం విశేషం. ఈ చానల్స్‌లో ఒకటేమిటి… మీకు ఏది కావాలంటే అది ఒక్క క్లిక్‌లో దొరుకుతుంది. ఒక్క విద్యా సంబంధితమైన పాఠాలే కాదు.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు కూడా ఇక్కడ కావల్సినంత కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. అన్నిటికంటే పరీక్షల సమయంలో అవసరమైన మెటీరియల్‌తో పాటు, క్లిష్టమైన అంశాలనూ విడమరిచి చెబుతున్నారు ఈ-గురువులు. మోడల్‌ ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్ట్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వారిని టార్గెట్‌గా చేసుకొని వివిధ కంపెనీలు పాఠాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాయి. సిలబ్‌సను అనుసరించి పాఠాలు ఉండటంతో విద్యార్థులు తరచూ ఈ చానల్స్‌ను బ్రౌజ్‌ చేస్తున్నారు. కంటెంటే హీరో…గౌరవ్‌ గార్గ్‌ 2015లో తన ‘స్టడీ ఐక్యూ’ యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించినప్పుడు ఇంత ఆదరణ లేదంటారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు వెళ్లే యువతీ యువకులు టార్గెట్‌గా హిందీలో దీన్ని ఆయన తీసుకువచ్చారు. స్టడీ మెటీరియల్‌తో పాటు కరెంట్‌ అఫైర్స్‌ ఇందులో ఉంటాయి. ‘ఈ తరహా చానల్స్‌ అప్పుడు అంతగా లేవు. ముఖ్యంగా హిందీ భాషలో అయితే కంటెంట్‌ అసలు దొరికేది కాదు. దాంతో మా చానల్‌ క్రమంగా పాపులర్‌ అయింది. దాంతో ఇలాంటివి చాలా పుట్టుకువచ్చాయి. ఎన్ని వచ్చినా ప్రస్తుతం దాదాపు 32 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌తో టాప్‌లో ఉన్నాం’ అంటారు గౌరవ్‌. కానీ… సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నంత మాత్రాన ఆదాయం రావాలని లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌తో పోలిస్తే విద్యా సంబంధిత చానల్స్‌ ద్వారా తక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది. ‘దీనిపై సంపాదించడమనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడితేనే ఎడ్యూ చానల్‌ని నడపగలమ’నేది గౌరవ్‌ అభిప్రాయం. ఏదిఏమైనా సరైన కంటెంట్‌ ఉంటేనే నెటిజనుడు మళ్లీ ఆ చానల్‌ వైపు చూస్తున్నాడు.

  విదేశీయుల చానల్స్‌తో పోలిస్లే కంటెంట్‌ పరంగా మనం ఎంతో మెరుగుపరుచుకోవాల్సి ఉంది. వర్చువల్‌ గురువులు, కంటెంట్‌ క్రియేటర్లూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ, దానికి అనుగుణంగా మెటీరియల్‌ను అందుబాటులో ఉంచితేనే విద్యార్థులను ఆకర్షించగలుగుతారన్నది నిపుణుల అభిప్రాయం. ఎందరికో లైఫ్‌…ఇక యూట్యూబ్‌లో పాఠాలు చెబుతూ, దాన్ని తమ ఆదాయ మార్గంగా చేసుకున్నారు చాలా మంది భారతీయ యువతీయువకులు. పుణేకు చెందిన కొరియోగాఫ్రర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ సోనాలి తన ‘లైవ్‌ టు డ్యాన్స్‌ విత్‌ సోనాలి’తో తెగ పాపులర్‌ అయిపోయింది. నెలకు నాలుగు డ్యాన్స్‌ పాఠాల వీడియోలు పోస్ట్‌ చేస్తూ… అంతే స్థాయిలో ఆదాయం ఆర్జిస్తోంది. అలాగే నవతరానికి కావల్సిన అన్ని అంశాలనూ జొప్పించి మెప్పించి యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగింది మాలిని గోయల్‌. లక్షల్లో వ్యూయర్‌షి్‌పతో నెటిజనులను తన ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ ‘ఈటీ బ్యూరో’ ద్వారా అలరిస్తోంది. సంగీతం, నాట్యం, విద్య, వికాసం… ఒకటని కాదు… ఏది కావాలంటే అది వీలున్నప్పుడు నేర్చుకొనే హాట్‌ స్పాట్‌గా యూట్యూబ్‌ మారిపోయింది. ఒక్క విద్యా సంబంధమైన పాఠాలే కాదు… పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతీ యువకులకు కూడా ఇక్కడ కావల్సినంత కంటెంట్‌ అందుబాటులో ఉంటోంది. మోడల్‌ ప్రశ్న పత్రాలు, మాక్‌ టెస్ట్‌లకు హిట్స్‌ ఎక్కువ నమోదవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos