సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. దేశంలో మరే రాజకీయ అధినేతకు లేని చిత్రమైన అలవాటు ఒకటి ఉంది. తనను తాను తోపుగా అభివర్ణించుకునే ఆయన.. అపర చాణుక్యుడిగా భావిస్తుంటారు. అందులో భాగంగా ఆయన చిత్రమైన రీతిలో వ్యవహరిస్తుంటారు. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ఎన్నికలు వస్తే చాలు.. బాబులో కనిపించే రంగులకు తెలుగు తమ్ముళ్లు తమ జీవితంలో బాబును క్షమించొద్దని డిసైడ్ అయిపోతుంటారు.
ఎన్నికలకు ముందు వరకూ పార్టీ కోసం శ్రమించే వారే తనకు దేవుళ్లు అని చెప్పే బాబు.. సరిగ్గా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాక డబ్బు సంచులు.. ఆర్థికంగా స్థితిమంతులు.. మా గొప్ప రికమండేషన్ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చేస్తూ.. అంత కాలం పార్టీని నమ్ముకున్న వాళ్లకు హ్యాండ్ ఇవ్వటం ఒక ఎత్తు.అంతేకాదు.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు బరిలోకి వచ్చేసి.. ప్రచారంలో దూసుకెళుతున్నా.. బాబు మాత్రం అభ్యర్థుల్ని ఫైనల్ చేయటం కోసం కిందా మీదా పడిపోతుంటారు.ఎన్నికలకు ఆర్నెల్ల ముందు తాము బరిలోకి దించే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని మా గొప్పగా ప్రచారం చేసుకున్నప్పటికి.. ఆఖరి క్షణాల్లో అభ్యర్థుల్నిప్రకటిస్తూ.. పార్టీ నేతలకు భారీగా బీపీలు.. షుగర్లు తెప్పించటంలో బాబుకు బాబే సాటి.అలాంటి బాబు మారిపోయారని.. మరో నాలుగైదు నెలల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల సెలక్షన్ ను ఇప్పటి నుంచే షురూ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏంది.. బాబు అప్పుడే అభ్యర్థుల ఎంపిక మొదలెట్టేశారా? అన్న ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే.. అనధికారికంగా తొలి అభ్యర్థిని అధికారికంగా ఫైనల్ చేసినట్లుగా చెబుతున్న వార్త ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరన్నది చూస్తే.. బీకాంలో ఫిజిక్స్ గా ప్రసిద్ధి చెందిన జలీల్ ఖాన్ కుమార్తెగా చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగనన్న జలీల్.. తనకు బదులుగా తన కుమార్తె – ఎన్నారై మహిళ షబానా ఖాతూర్ కి విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ టికెట్ ఇవ్వాల్సింది కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన బాబు.. ఆమెకు టికెట్ ఇచ్చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బాబు తన తీరుకు భిన్నంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే ప్రకటించిన అభ్యర్థినిగా షబానాను చెప్పుకోవాలి. ఇదే రీతిలో మరికొన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. ఎందుకిలా మారిపోయినట్లు బాబు?