ఎస్‌ఐ వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో చోటు చేసుకుంది. మిరియాల వెంకట కిరణ్, అతని భార్య హెలీనా లు ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తండ్రి సుబ్బారావు మాట్లాడుతూ… కఅష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ సత్యనారాయణ వేధింపుల వల్లే తన కొడుకు, కోడలు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. విజయవాడ భవానిపురానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో తన కొడుకును నమ్మించి, తన కుమారుడి ద్వారా కొంతమంది నుండి కొంత నగదు తీసుకున్నాడని తెలిపారు. దానిని తిరిగి ఇచ్చేయాలని బాధితులు కఅష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. కఅష్ణా జిల్లా పోలీసులు అసలు కారకుడైన రాజశేఖర్ ని వదిలేసి, మోసపోయిన తమ కుమారుని అన్యాయంగా అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించడంతో ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి సుబ్బారావు వాపోయారు. గత రెండు రోజులుగా విచారణ పేరుతో తమ కొడుకును ఎస్‌ఐ తీవ్రంగా హింసించాడని, పోలీసుల వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని, బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.