బెంగళూరు: కర్నాటక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనా కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ ఆచూకీ లభ్యం కాకపోవడంపై కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఈగిల్టన్ రిసార్టులో విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై దాడి చేసిన ఘటనలో గణేశ్‌పై గత నెలలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన… కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలకు సైతం దొరకలేదు. కాగా అసెంబ్లీ సమావేశాలకు ఒకవేళ ఎమ్మెల్యే గణేశ్ హాజరైతే.. ఆయనను అరెస్టు చేసేందుకు ఇప్పటికే కర్నాటక పోలీసులు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనుమతి తీసుకున్నారు. గణేశ్ దాడిలో గాయపడి ఇటీవలే కోలుకున్న ఆనంద్ సింగ్ ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు లేక, తర్వాత వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఉభయ సభల సమావేశాల నేపథ్యంలో నిన్న సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య విందు ఏర్పాటు చేశారు. దీనికీ మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఇందుకు గల కారణాలను వివరణ ఇవ్వడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కర్నాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందంటూ బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇరువైపులా ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు కీలకంగా మారింది. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది.