రాజంపేట టిడిపి ఎమ్మెల్యే వైసిపి లోకి ఎంట్రీతో అక్కడి సమీకరణాలు మారిపోతున్నాయి. రాజంపేట నుండి కడప జిల్లా వైసిపి అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి ఎమ్మెల్యే సీటు కోసం పోటీ లో ఉన్నారు. జగన సైతం ఆయనకే తొలి ప్రాధాన్య త ఇవ్వనున్నారు. అయితే, మరి మేడా మల్లిఖార్జున రెడ్డికి జగన్ ఇచ్చిన హామీ ఏంటి..పార్టీలో జరిగే మార్పులేంటి..
మేడా ఎంట్రీతో కొత్త మార్పులు..
కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టిడిపిని వీడి వైసిపి లో చేరారు. అధికారికంగా ఈ నెల31న పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే, మేడా మల్లిఖార్జున రెడ్డి వైసిపి లో చేరే సమయంలో జగన్ ఆయనకు ఇచ్చిన హామీ ఏంటనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే, మేడా మల్లిఖార్జున రెడ్డి జగన్ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తానని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మల్లిఖార్జున రెడ్డి సోదరుడు రఘునాదరెడ్డి – జగన్ ను కలిసి తాము వైసిపి లో చేరే అంశం పై చర్చించారు. ముందుగా టిడిపి నుండి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసిపి లో చేరాలని ఆ సమయంలో పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చేది చర్చిస్తామని స్పష్టం చేసారు. దీంతో..అనేక తర్జన భర్జలన తరు వాత మేడా సోదరులు వైసిపి లో చేరారు. జగన్ సమక్షంలో తమ రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. జగన్ తో చర్చల సందర్భంగా పలు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. వీటిలో ఏ రకంగా ముందుకు వెళ్లాలో..31న పార్టీలో అధికారికంగా చేరే సమయంలో ఖరారు కానుంది.
కొత్త సమీకరణాలు..ఆసక్తి కరం..!
మేడా సోదరుల ఎంట్రీతో జగన్ ముందు వచ్చిన ప్రతిపాదనలు ఆసక్తి కరంగా ఉన్నాయి. అందులో మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథరెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, లేదంటే రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశముందని వైసిపి నేతలు పేర్కొంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మిధున్‌రెడ్డి చిత్తూరు జిల్లా లోని తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే సీటు ఇస్తే రాజంపేట లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తాననే హామీని ముందుగానే తీసుకున్నారని సమాచారం. అయితే, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనూ.. అనంతపురం ఇన్‌ఛార్జ్ గానూ మిధున్ రెడ్డి ఆయన తండ్రి రామచంద్రారెడ్డి ఇద్దరూ పార్టీలో కీలకంగా మారారు. ప్రత్యేక హోదా కోసం మిధున్ రెడ్డి ఎంపి పదవికి రాజీనామా చేసారు. అయితే, ఆయనను ఎమ్మెల్యేగా బరిలోకి దింపటం పై చర్చలు సాగుతున్నాయి. తండ్రి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో..మిధున్ రెడ్డిని ఎంపీగానే బరిలోకి దించుతారని పార్టీ లో మరో వాదన. పార్టీలో ఇటువంటి వాదనల నడుమ..మేడా ఎంట్రీ సమయంలో జగన్ ఈ సమీకరణాల విషయంలో అంతిమంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.