మోరెనా: సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పేద ప్రజలకు ఇళ్లు కట్టించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ ఎమ్మెల్యేకు ప్రజలే ఇల్లు కట్టిస్తున్నారు. సొంతింటిని నిర్మించుకునే స్తోమత లేక పూరిగుడిసెలో ఉంటున్న తమ ఎమ్మెల్యేకు చందాలు వేసుకుని మరీ పక్కా ఇల్లు కట్టిస్తున్నారు ఆ నియోజకవర్గ వాసులు. గతేడాది నవంబరులో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి సీతారామ్ ఆదివాసి విజయం సాధించారు. 55ఏళ్ల సీతారామ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఆయన ఇంకా జీతం అందుకోలేదు. దీంతో నిరుపేద అయిన సీతారామ్ తన భార్యతో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నారు.దీంతో నియోజకవర్గ ప్రజలు ముందుకొచ్చి తమ ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిచ్చేందుకు పూనుకున్నారు. చందాలు వేసుకుని సీతారామ్‌కు పక్కా ఇల్లు నిర్మిస్తున్నారు. ‘మా ఎమ్మెల్యే గుడిసెలో ఉండటం మాకు సిగ్గుగా అన్పించింది. ఆయన మాకోసం ఎంతో చేశారు. కష్టాల్లో మాకు అండగా నిలిచారు. అందుకే విరాళాలు వసూలు చేసి ఇల్లు కట్టిస్తున్నాం’ అని విజయ్‌పూర్ నియోజకవర్గంలోని పిప్రానీ గ్రామానికి చెందిన ధనరాజ్ చెబుతున్నారు.దీనిపై ఎమ్మెల్యే సీతారామ్ మాట్లాడుతూ.. ‘మాది చాలా పేదకుటుంబం. ఇల్లు కట్టుకునేందుకు సరిపడా డబ్బులు లేవు. నేను ఎన్నికల్లో గెలిచినప్పుడు నా నియోజకవర్గ ప్రజలు నాణేలతో నాకు తులాభారం చేశారు. ఆ డబ్బుతోనే పూరిగుడిసె నిర్మించుకున్నా. ఇప్పుడు ప్రజలు నాకు ఇల్లు కట్టించడం ఆనందంగా ఉంది. నేను జీతం అందుకున్న తర్వాత ఆ డబ్బును పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తాను’ అని చెబుతున్నారు.