దిల్లీ: ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లంటే పాటలు, మాటలు, ప్రకటనలే కాదు.. ఇకపై వార్తలూ వినొచ్చు. ఆలిండియా రేడియో (ఏఐఆర్) వార్తల బులెటిన్లను ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లలో ప్రసారం చేసేందుకు అనుమతించనున్నారు. కొన్ని షరతులు, నిబంధనలకు లోబడి వార్తలు ఆంగ్లం, హిందీ భాషల్లో నిర్దిష్ట షెడ్యూలుకు అనుగుణంగా ప్రసారం కానున్నాయి. ఆలిండియా రేడియో వార్తల్ని ప్రైవేట్ ఎఫ్‌ఎం ప్రసార సంస్థలతో పంచుకునే కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాఠోడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం పెంచాలనేదే ప్రభుత్వ ప్రాధాన్యమని, ఆదాయ సంపాదనకు ద్వితీయ ప్రాధాన్యమని, అందుకని వార్తా సేవల్ని ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. ఇది పౌరులకు సాధికారతను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా ఏం కావాలని వ్యాఖ్యానించారు. ఇది చరిత్రాత్మక ఘట్టమని ప్రసార భారతి ఛైర్మన్ ఎ.సూర్యప్రకాశ్ తన సందేశంలో పేర్కొన్నారు. తమ వేదికల ద్వారా వార్తలు ప్రసారం చేయాలనే సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు భారత రేడియో ఆపరేటర్ల సంఘం అధ్యక్షురాలు అనురాధ ప్రసాద్ పేర్కొన్నారు. వార్తల బులెటిన్లను ప్రసారం చేయాలని భావించే ప్రైవేటు ఎఫ్‌ఎం ఛానళ్లు మందుగా ఆలిండియా రేడియో వార్తల సేవా విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐఆర్ వార్తల్ని ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా సంపూర్తిగా ప్రసారం చేయాల్సి ఉంటుంది. వార్తలకు సంబంధించిన క్రెడిట్‌ను మాత్రం ఏఐఆర్‌కే ఇవ్వాలి. ఈ సేవల్ని ట్రయల్స్ రూపంలో ఈ ఏడాది మే 31దాకా అందజేస్తారు.