నకిలీ ఓటర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారుల పేరు మీదే ఫేక్ ఓట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేరుతో హైదరాబాద్ మెహదీపట్నంలో ఫేక్ ఓటరు కార్డు పుట్టుకొచ్చింది. మాజీ సీఈసీ ఓపీ రావత్ పేరుతో మరో ఓటరు కార్డు జారీ అయ్యింది.తెలంగాణలో ఓట్ల జాబితా తప్పుల తడకగా ఉందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే అంశంపై కోర్టును కూడా ఆశ్రయించారు కాంగ్రెస్ నేతలు.. కానీ అలాంటిదేమి లేదని.. అంతా సవ్యంగానే ఉందంటూ ఎన్నికల కమిషన్ వాధిస్తూ వచ్చింది. ఎలాంటి చర్యలు చేపట్టకుండానే ఎన్నికలను నిర్వహించేసింది. అయితే సాక్షాత్తూ ఎన్నికల కమిషన్‌కే తెలంగాణలో షాక్ తగిలింది.హైదరాబాద్‌లో ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉండడాన్ని గతంలో టీవీ 5 వెలికి తెచ్చింది. వరుస కథనాలు ప్రసారం చేసింది. అయితే ఆ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని అప్పట్లో ఈసీ స్పందించింది. కానీ చర్యలు మాత్రం కనిపించలేదు..నకిలీ ఓట్లపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సమయంలోనే.. మరో షాకింగ్ వార్త బటయకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజిత్ కుమార్ పేరును నాంపల్లి నియోజకవర్గంలోని మెహదీపట్నం వడ్డెర బస్తీ పోలింగ్ స్టేషన్ లోని ఓటర్ జాబితాలో చేర్చారు. దానికి WRH 2400380 ఎపిక్ నెంబర్ కూడా ఇచ్చారు. మాజీ సీఈసీ రావత్ కు WRH 2400372 నంబర్‌తో ఓటు హక్కును ఇదే ప్రాంతంలో సృష్టించారు ఫేక్ రాయుళ్లు.నకిలీ ఓటరు ఐడీ కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పును గుర్తించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి కొందరు ఆకతాయిలు కావాలనే ఇలా చేసారని నిర్ధారించారు. వీరిని పట్టుకునేందుకు GHMC డిప్యూటీ కమిషనర్ , నాంపల్లి నియెజక వర్గ RO ఆలీ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఓటర్ ఐడి కార్డులపై పోలీసులు విచారణను ప్రారంభించారు.
గతంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ పేర్లతోపాటు ఇతర సినీ ప్రముఖులను ఓటర్ జాబితాలో నమోదు చేశారు. కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఫేక్ ఓట్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.