ఎన్టీఆర్ బయోపిక్.. హైకోర్టు నోటీసులు

  • In Film
  • January 23, 2019
  • 929 Views
ఎన్టీఆర్ బయోపిక్.. హైకోర్టు నోటీసులు

సినీ రంగ ప్రముఖుడు,టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆయన కుమారుడు సినీనటుడు,ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సినీ జీవితానికి సంబంధించి ఓ భాగం కూడా విదులయింది. ఆయన రాజకీయ జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ఎన్ని నిజాలు చూపిస్తారో అని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితం గురించి అన్నీ నిజాలే చెప్తా అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ని చిత్రీకరిస్తున్నారు. ‘దగా…దగా.. కుట్ర..’ అంటూ ఓ పాటను కూడా విడుదల చేశారు. మొదలు పెట్టినప్పటినుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ చిత్రం..ఈ పాటతో వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర సెన్సార్‌ బోర్డులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వివరాలు ఇలా ఉన్నాయి…సినిమాతోపాటు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లలో పాటను తొలగించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలోని పాట ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబును మోసగాడిగా చూపించేలా ఉన్నందున దాన్ని సినిమా నుంచి తొలగించేలా సెన్సార్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషనర్‌ ఏపీకి చెందిన వ్యక్తికాగా ఇక్కడెందుకు పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. పిటిషన్ దాఖలు చేసే నాటికి హైకోర్టు ఉమ్మడిగానే ఉందని, అంతేకాకుండా పాటను ఇక్కడే విడుదల చేశారని న్యాయవాది చెప్పారు. అనంతరం ధర్మాసనం.. సెన్సార్‌ బోర్డులతోపాటు నిర్మాత రాకేశ్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో ?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos