దిల్లీ: బిజు జనతా దళ్ ఎంపీ లడు కిశోర్ స్వైన్ మృతితో లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహజన్.. కిశోర్ మరణం గురించి సభకు తెలిపారు. అనంతరం సభ్యులు ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేసినట్లు సుమిత్రా మహజన్ ప్రకటించారు.బీజేడీ సీనియర్ నేత కిశోర్(71) గత కొంతకాలంగా మూత్త్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. భువనేశ్వర్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ తరఫున కిశోర్ అస్కా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కిశోర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు సంతాపం ప్రకటించారు.