ఉద్యోగాల పేరుతో మహిళల్నివిక్రయిస్తున్నారు

  • In Crime
  • January 23, 2019
  • 934 Views
ఉద్యోగాల పేరుతో మహిళల్నివిక్రయిస్తున్నారు

ఒకడు పోతుల శ్రీనుబాబు, ఇంకొడేమో ఎల్లమెల్లి శ్రీనుబాబు. వీళ్లిద్దరూ దుబాయ్ శీనుగాళ్లే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను తీసుకెళ్లి అమ్మేస్తున్న ఘరానా కేటుగాళ్లు. అక్రమ సంపాదనకు అలవాటుపడి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న కంత్రీగాళ్లు. ఏళ్లకొద్దీ సాగుతున్న వీరి గుట్టు ఎట్టకేలకు రట్టైంది.పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను, ఎల్లమెల్లి శ్రీనుబాబు అలియాస్ అల్ప శ్రీను, ఏడుకొండలు, సత్యవతి, కరీం, మరియమ్మ.. వీరంతా కూడా చాలాకాలంగా దుబాయ్ లో పనిచేస్తున్నారు. అయితే అధిక సంపాదన కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరిట మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. వీరి ఉచ్చులో పడి తీరా దుబాయ్ కి వెళ్లినవారిని అమ్మేస్తున్నారు. వర్క్ పర్మిట్ వీసా కాకుండా విజిట్ వీసాలు ఇప్పిస్తూ బాధితుల జీవితాలతో ఆడుకుంటోంది ఈ ముఠా.

ఉద్యోగాల పేరుతో ఎర..! షేకులకు అమ్మిన వైనం.
గల్ఫ్ లో ఉద్యోగాలంటూ మహిళలను మభ్యపెడుతూ అక్రమాలకు పాల్పడుతోంది ఈ ముఠా. నెలకు వేలల్లో జీతాలంటూ ఆశపెట్టి ముగ్గులోకి దించుతున్నారు. దుబాయ్ కు వస్తే మీ దశ తిరుగుతుందంటూ నమ్మిస్తున్నారు. అయితే ఈ ముఠా సభ్యులు చాలాకాలంగా విదేశాల్లోనే ఉంటుండటంతో వీరిని గుడ్డిగా ఫాలో అవుతున్నారు చాలామంది. పోతుల శ్రీనుబాబు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందినవాడు కావడంతో… ఆ ప్రాంతంలో ఈ ముఠా పలువురు ఏజెంట్లను కూడా నియమించింది. వీరంతా కలిసి ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలువురు వివాహిత మహిళల్ని టార్గెట్ చేశారు.

వీసా దగ్గర్నుంచి విమానం టికెట్ వరకు అంతా తామే చూసుకుంటామని నమ్మబలికి లక్షల రూపాయలు గుంజుతున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత తమను నమ్మి వచ్చినవారిని హ్యుమన్ రిసోర్స్ ఏజెన్సీలకు అమ్మేస్తున్నారు. బాధితుల నుంచి డబ్బులు తీసుకోవడమే గాకుండా, అటు ఏజెన్సీల దగ్గర కమీషన్ తీసుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. అయితే సదరు మహిళలను కొనుగోలు చేసిన ఏజెన్సీ నిర్వాహకులు వారితో అడ్డగోలు చాకిరీ చేయించుకోవడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు దుబాయ్ షేకులు వారిని కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే ఈ ముఠాను నమ్మి దుబాయ్ కు వెళ్లే మహిళలకు వర్క్ పర్మిట్ వీసా కాకుండా విజిట్ వీసాలు మాత్రమే ఇస్తున్నారు. విజిట్ వీసాలతో విదేశాల్లో ఎక్కువ కాలం ఉండటమనేది నేరం.దీంతో అక్కడి పోలీసులకు తమ విషయం తెలిస్తే ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు. అదే ఈ ముఠా పాలిట వరంగా మారుతోంది.
గుట్టురట్టు ఇలా..! ఈ ముఠా వలలో చిక్కిన చాలామంది మహిళలు విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఘట్‌కేసర్‌కు చెందిన దంపతులు ఎదురుతిరగడంతో వీరి గుట్టురట్టైంది. భార్యభర్తలను విదేశాలకు పంపించడానికి ఈ ముఠా 4 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత భార్యను దుబాయ్ పంపించిన ముఠా సభ్యులు… ఏజెన్సీకి ఆమెను అమ్మేశారు. అయితే అక్కడ ఆమెను ఇబ్బందులు పెట్టడంతో పనిచేయడానికి నిరాకరించింది. ఆ క్రమంలో కొన్నిరోజులకు భర్తను కూడా దుబాయ్ పంపించారు. ఆయన వెళ్లాక అక్కడి పరిస్థితి అర్థమైంది. దీంతో ముఠా సభ్యులను నిలదీశారు దంపతులు. అంతేకాదు గొడవ కూడా జరగడంతో విషయం పెద్దగా కాకుండా జాగ్రత్తపడ్డ ముఠా… వారిద్దరినీ తిరిగి హైదరాబాద్ పంపించేశారు. నగరానికి చేరుకున్న అనంతరం బాధితులు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ను కలిసి పరిస్థితి వివరించారు. వీరి ఫిర్యాదు మేరకు గతేడాది జూన్ 19న కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా అప్పట్లోనే అమలాపురం వెళ్లిన మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందం పోతుల శ్రీనుబాబు సోదరుడు పోతుల దాస్ తో పాటు ఏజెంట్లుగా పనిచేస్తున్న రామారావు, త్రిమూర్తులు, మురళి, తాతాజీని అరెస్ట్ చేశారు.
ఒక్క శీనుగాడు దొరికాడు.. పరారీలో ఇంకోడు..!
ఎల్లమెల్లి శ్రీనుబాబు అలియాస్ అల్ప శ్రీను డిసెంబర్ నెలలో అమలపురానికి చేరుకున్నాడు. మరికొంతమంది మహిళలను విదేశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలోనే శ్రీను స్వస్థలానికి వచ్చినట్లు తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందం అమలాపురం వెళ్లింది. శ్రీనును అదుపులోకి తీసుకుని పాస్‌పోర్టును సీజ్‌ చేయడంతో పాటు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోతుల శ్రీనుబాబు అలియాస్ దుబాయ్ శ్రీను ఇంకా విదేశాల్లోనే ఉన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos