దిల్లీ/ బెంగళూరు:యిన్ఫోసిస్ మరోమారు షేర్ల బైబ్యాక్‌కు శ్రీకారం చుట్టబోతోంది. 2017 డిసెంబరులో రూ.13,000 కోట్ల విలువైన షేర్లను ఇన్ఫీ తిరిగి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు బైబ్యాక్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రత్యేక డివిడెండు కూడా ప్రకటిస్తుందని అంటున్నారు. మూలధన కేటాయింపు విధానం అమల్లో భాగంగా షేర్ల బైబ్యాక్, ప్రత్యేక డివిడెండుతో పాటు మరికొన్ని ఇతర ప్రతిపాదనలపై ఈనెల 11న (శుక్రవారం) జరిగే సమావేశంలో డైరెక్టర్ల బోర్డు చర్చిస్తుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇదే రోజున అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను కూడా ఈ ఐటీ దిగ్గజం వెల్లడించనుంది. సమావేశానంతరం బోర్డు తీసుకునే నిర్ణయాలను వెల్లడిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది. కాగా.. వాటాదార్లకు ప్రతిఫలం రూపంలో చెల్లించేందుకు రూ.13,000 కోట్లను గతేడాది ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్ బోర్డు గుర్తించింది. ఇందులో నుంచి ప్రత్యేక డివిడెండు రూపేణ ఒక్క షేరుకు రూ.10 చొప్పున మొత్తంగా రూ.2,600 కోట్లను 2018 జూన్‌లో చెల్లించింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాటాదార్లకు చెల్లించేందుకు రూ.10,400 కోట్లను బోర్డు గుర్తించింది. బోర్డు నిర్ణయానికి అనుగుణంగా ఈ చెల్లింపులు చేయనున్నట్లు 2018 ఏప్రిల్‌లో ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.
మరో ఉన్నతాధికారి గుడ్‌బై
ఇన్ఫోసిస్ నుంచి మరో ఉన్నత స్థాయి అధికారి వైదొలిగారు. కంపెనీలో ఇంధనం, యుటిలిటీస్, వనరులు, సేవల విభాగానికి గ్లోబల్ హెడ్‌గా ఉన్న సుదీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇన్ఫీలో దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన పనిచేశారు. అయితే సుదీప్ రాజీనామాపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. సుదీప్ నేతృత్వం వహిస్తున్న ఇంధనం, యుటిలిటీస్ విభాగం పోర్ట్‌ఫోలియో దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. గతేడాది అక్టోబరులో ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈయన కంటే ముందు కంపెనీలో అత్యంత ప్రాధాన్యమున్న అధికారుల్లో ఒకరైన ఎం.డి.రఘునాథ్ తన సీఎఫ్‌ఓ పదవికి రాజీనామా చేశారు.