తను కోరుకున్న చోట ఎమ్మెల్యే సీటు ఇవ్వడమేకాదు, ఆ తర్వాత మంత్రిపదవి కూడా ఇవ్వాలి. ఇలా అని రాసిచ్చిన పార్టీలోనే చేరతానంటూ ఆమధ్య సంచలన ప్రకటన చేశాడు అలీ. ఈ ముచ్చట జరిగి కొన్ని రోజులైంది. అలీ మళ్లీ చప్పుడు చేయలేదు. ఇంతకీ ఏమైంది.. అలీ ఏ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాడు.. ఎవరైనా రాసిచ్చారా లేదా..?తాజా సమాచారం ప్రకారం అలీకి ఏ పార్టీ నుంచి స్పష్టత రాలేదు. అలా అని ఏ పార్టీ అతడ్ని వదులుకోనూ లేదు. జనసేనతో కలుపుకొని దాదాపు అన్ని పార్టీలతో టచ్ లోనే ఉన్నాడు ఈ హాస్యనటుడు. కానీ అతడు ఆశిస్తున్న హామీ మాత్రం ఏ పార్టీ నుంచి ఇప్పటివరకు దక్కలేదు.ముందుగా వైసీపీ విషయానికొస్తే, జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో అలీ పార్టీలో చేరతాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. దీనికి కారణం జగన్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడమే. అలీ ఆశిస్తున్న గుంటూరు-1 లేదా రాజమండ్రి టిక్కెట్ కు వైసీపీలో గట్టి పోటీ ఉంది. అందుకే అలీకి మాటివ్వలేకపోయారు జగన్.ఇక టీడీపీ విషయానికొస్తే అలీకి దాదాపు లైన్ క్లియర్. కానీ ఇతడే కాస్త జంకుతున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవు. ఓవైపు ‘దేశం’ నేతలంతా పవన్ లేదా జగన్ పంచన చేరుదామని ఆలోచిస్తుంటే.. అలాంటి పార్టీతో కలిసి ఎన్నికల గోదారిని ఈదడం అలీకి ఇష్టం లేదు. అందుకే టీడీపీ కీలక సభ్యులు కొందరు అడుగుతున్నా.. సొట్ట బుగ్గలతో ఓ నవ్వు నవ్వి ఊరుకుంటున్నాడు.టీడీపీ తరహాలోనే జనసేనలో కూడా అలీకి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. కానీ జనసేన కూడా నెగ్గుకొచ్చే పార్టీ కాదనే విషయం ఇతడికి తెలుసు. పైగా తన పార్టీలోకి ఏమీ ఆశించకుండా రావాలంటూ పవన్ కండిషన్ పెట్టిన విషయాన్ని అలీనే స్వయంగా వెల్లడించాడు. దీంతో అలీ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. ప్రస్తుతానికైతే సినిమాలు చేసుకుంటున్నాడు.