తమిళ హీరో కార్తీ,కాజల్ ముఖ్యతారాగణంగా తొమ్మిదేళ్ల క్రితం తమిళం,తెలుగులో విడుదలైన నాపేరు శివ సినిమా గుర్తుందా.అందులో కొంతమంది చెడు అలవాట్లకు బానిసలైన యువకులు అమ్మాయిలను అత్యాచారం చేసి అనంతరం శరీరాన్ని ముక్కముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేస్తుంటారు.సరిగ్గా ఇదే రీతిలో కొద్ది రోజుల క్రితం చెన్నై నగరంలో చోటుచేసుకున్న తమిళ సినీ నటి సంధ్య హత్య కలకలం సృష్టించింది.కేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు గురువారం హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సంధ్య భర్త బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు.తమిళ ఇండస్ట్రీలో సహాయ దర్శకుడిగా పని చేస్తున్న బాలకృష్ణన్‌కు చాలా కాలం క్రితం తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది.అనంతరం భార్య సంధ్యను తీసుకొని చెన్నై జాఫర్‌ఖాపేటలో నివాసముంటున్నాడు.తనకున్న పరిచయాలతో భార్య సంధ్యకు పలు సినిమాల్లో అవకాశాలు ఇప్పించడంతో సంధ్య కొద్ది కాలంలోనే చిత్రాల్లో బిజీ తారగా ఎదిగారు.అప్పటి నుంచి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని సినీ పరిశ్రమలో పరిచయమైన వ్యక్తులతో సంధ్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందంటూ విచారణలో తెలిపాడు.దీనిపై పలుమార్లు హెచ్చరించినా సంధ్య పట్టించుకోలేదని పైగా విడాకులు ఇస్తానంటూ తననే బెదిరిస్తుండేదని తెలిపాడు. దీంతో జనవరి 19వ తేదీన ఆమెను నరికి చంపానన్నాడు. ఒక రోజంతా అలానే ఇంట్లో ఉంచినట్లు చెప్పాడు. 20వ తేదీన రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరి శరీర భాగాలను పలు ప్రాంతాల్లో పడేసినట్లు అంగీకరించాడు..
