జాతీయ పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం ఉత్సాహాన్ని చూపడంలేదు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప.. నేషనల్ పార్టీలను పక్కన పెడుతున్నాయి ప్రాంతీయ పార్టీలు. ఈ పరంపరలో అన్నాడీఎంకే కూడా చేరింది. అసలే జయలలిత వంటి పెద్ద దిక్కులేకపోయినా.. ఇన్నాళ్లుగా తమిళనాట అన్నాడీఎంకే సర్కారును కాపాడుతున్నది బీజేపీనే అయినా.. ఆ పార్టీతో కలిసి పోటీచేసేది లేదని అన్నాడీఎంకే అంటోంది. తమ రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లకూ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టినట్టుగా అన్నాడీఎంకే ప్రకటించింది.బీజేపీతో పొత్తు ఊహాగానాలను ఆ పార్టీ నేతలను కొట్టిపడేస్తున్నారు. సొంతంగా అన్ని ఎంపీ సీట్లకూ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేంద్రంలో బీజేపీవాళ్లు తమిళనాట పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉండకపోతే.. ఇది ఎప్పుడో కుప్పకూలేది.అయితే బీజేపీతో కలిసి పోటీచేస్తే వచ్చే సీట్లు కూడా రావు అనేది అన్నాడీఎంకే లెక్కలాగుంది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం.. అన్నాడీఎంకేకు నాలుగు ఎంపీ సీట్ల వరకూ వచ్చే అవకాశాలున్నాయి. టైమ్స్ నౌ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాట డీఎంకే స్వీప్ చేసే అవకాశాలున్నాయి.కాంగ్రెస్ కు కొన్ని సీట్లను ఇచ్చి, ఇతర మిత్రపక్షాలకూ కొన్ని సీట్లను ఇవ్వనున్న డీఎంకే.. మెజారిటీ సీట్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. యూపీఏ కూటమిలో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా డీఎంకేనే నిలవనుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.