లక్నో : ట్రిపుల్ తలాఖ్ ఇవ్వడం చట్టరీత్యా నేరమని లోక్‌సభలో బిల్లు పాసైనా ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అమ్మమ్మను చూసేందుకు పుట్టింటికి వెళ్లిన భార్య పదినిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చిందని భర్త ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈటాహ్ పట్టణంలో సంచలనం రేపింది. ఈటాహ్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు తన అమ్మమ్మను చూసేందుకు పుట్టింటికి వెళ్లి 30 నిమిషాల్లో తిరిగి రావాలని భర్త హుకుం జారీ చేశారు. భార్య పుట్టింటి నుంచి పదినిమిషాలు ఆలస్యంగా అత్తగారింటికి తిరిగివచ్చింది. అంతే ఆగ్రహించిన భర్త తన సోదరుడి మొబైల్ నంబరుకు ఫోన్ చేసి తలాఖ్ తలాఖ్ తలాఖ్ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో నిర్ఘాంతపోయిన భార్య న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది. గతంలో తన పుట్టింటి నుంచి భర్త కట్నం తీసుకురాలేదని అత్తింటివారు తనను కొట్టారని, తనకు గతంలో దీనివల్ల అబార్షన్ కూడా అయిందని వివాహిత అధికారులకు ఫిర్యాదు చేసింది. తన పుట్టింటివారు పేదవారు కావడంతో వారు కట్నం ఇవ్వలేక పోయారని వివాహిత అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యమని వివాహిత ఆవేదనగా చెప్పింది. ట్రిపుల్ తలాఖ్ ఉదంతంపై తాము దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని అలీగంజ్ ఏరియా అధికారి అజయ్ భదారియా చెప్పారు.