బాలియా(యూపీ):కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలపై ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ‘రావణుడు’ అనీ, ఆయన చెల్లెలు ‘శుార్పణఖ’ అంటూ రాక్షసులతో పోల్చారు. రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చుతూ పాట్నాలో పోస్టర్లు వెలిసిన కొద్ది సేపటికే.. ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తన నోటికి పనిచెప్పడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ విరిగిపోయిన పడవనీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఖాయమని ఆయన పేర్కొన్నారు. ‘‘లంకలో రాముడు, రావణుడికి మధ్య యుద్ధం జరగకముందు.. రావణుడు తన సోదరి శూర్పణఖను పంపిన విషయం మనందరికీ తెలుసు. అలాగే వచ్చే ఎన్నికల కోసం రాహుల్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత దేశం కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు..’’ అని చెప్పుకొచ్చారు. ‘శ్రీరాముడి’ గెలుపు తథ్యమని ప్రజలకు తెలుసుననీ.. నిస్సందేహంగా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని సురేంద్ర సింగ్ అన్నారు. ‘‘ప్రధాని మోదీ రాముడు. రాహుల్ రావణుడు. ఆయన తన చెల్లెలు శూర్పణఖ (ప్రియాంక)ను రాజకీయాల్లో తీసుకొస్తున్నారు. అయితే రాముడే గెలుస్తాడని ప్రజలందరికీ తెలుసు…’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రియాంక గాంధీని తూర్పు యూపీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె రంగప్రవేశం లోక్‌సభ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చివేయగలదని భావిస్తున్నారు.