ఆకుల.. ఇదేమైనా భావ్యమా..?!

ఆకుల.. ఇదేమైనా భావ్యమా..?!

బీజేపీ తరఫున మళ్లీ గెలవడం కష్టం అనుకున్నారు.. బయటకు వెళ్లిపోయారు. ఏ లెక్కలతోనో జనసేనలోకి చేరుతున్నారు. అందులో తప్పు పట్టడానికి ఏమీలేదు. అందులోనూ దర్జాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కాబట్టి చాలామంది రాజకీయ నేతలకన్నా ఆకుల సత్యనారాయణ బెటర్ అనే చెప్పాలి. అయితే ఈయన ఇప్పుడు బీజేపీ మీద మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా కామెడీగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీని సమర్థించడం లేదు. అయితే ఆకులకు ఇప్పుడే అన్నీ గుర్తుకు వచ్చాయా? అనేది ప్రశ్న అవుతోంది.రాష్ట్రానికి బీజేపీ నాయకత్వం న్యాయం చేయలేదని ఆకుల అన్నాడు. ప్రత్యేకహోదా, కడపలో ఉక్కుపరిశ్రమ, రైల్వేజోన్ తదితరాల విషయంలో బీజేపీ నాయకత్వ తీరు సరికాదని.. రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆకుల విమర్శించాడు. మరి ఇవే విమర్శలను ఆకుల ఇన్ని రోజులూ ఎందుకు చేయలేదు?ప్రత్యేకహోదా గురించి బీజేపీ ఎలా వ్యవహరించిందో ఇన్ని రోజులకూ ఈయనకు తెలియలేదా? హోదా ఇవ్వం అని రెండు మూడేళ్ల నుంచి ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్లు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు చంద్రబాబుతో సహా బీజేపీ నేతలు హ్యాపీగానే రియాక్ట్ అయ్యారు. హోదా వద్దు అనే వీళ్లంతా అన్నారు. హోదాకు మించి కేంద్రం ప్యాకేజీతో అదరగొడుతోందని చెబుతున్నారు.ఇక కడపలో ఉక్కు పరిశ్రమ, రైల్వేజోన్ విషయంలో కూడా ఇన్నాళ్లూ ఆకుల ఏం మాట్లాడాడో.. టీవీల్లో చర్చా కార్యక్రమాలను వీక్షించిన వాళ్లందరికీ తెలుసు. అప్పుడంతా బీజేపీ తీరును తెగవెనకేసుకొచ్చాడు. ఇప్పుడు మరేవో కారణాలు చెప్పి బీజేపీకి రాజీనామా చేసి ఉండాల్సింది. అయితే ఇన్నిరోజులూ ఏ విషయంలో బీజేపీ నాయకత్వాన్ని వెనకేసుకు వచ్చారో.. ఇప్పుడు అదే అంశం గురించి బీజేపీని విమర్శిస్తున్నారీయన. మరి ఇంత తెలిసిన వ్యక్తి రెండేళ్ల కిందటే.. హోదా ఇవ్వమని బీజేపీ వాళ్లు ప్రకటించినప్పుడే రాజీనామా చేసి ఉంటే, అప్పుడు కదా.. హీరోగా నిలిచి ఉండేవాడు. రాజకీయ నేతలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. తమకు విలువలు లేకపోయినా, తమకు ఓటేసే ప్రజలకు మాత్రం విలువల వలువలు కూసింత మిగిలే ఉన్నాయనేది! 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos