అసిస్టెంట్ రిజిస్ట్రార్లపై“సుప్రీం” వేటు.

న్యూఢిల్లీ :  న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పూర్తిగా మార్చేసి.. తప్పుడు తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన నేరానికి ఇద్దరు సహాయ రిజిస్ట్రార్లు- మానవ్‌ శర్మ, తపన్‌ కుమార్‌ చక్రవర్తి లను బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సేవల నుంచి తొలగించారు. జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 311, సుప్రీంకోర్టు నిబంధనలలోని సెక్షన్ 11(3) ప్రకారం నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినపుడు ఈ అధిరాన్ని వినియోగిస్తారు. ఇటువంటి సందర్భాల్లో సాధారణ క్రమశిక్షణ చర్యలు ఉండవు.

ఇదీ నేపథ్యం

బకాయిలు చెల్లించనందుకుగానూ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూపుపై ఎరిక్సన్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 7న అనిల్‌ అంబానీ, మరికొందరు రిలయన్స్‌ ప్రతినిధులకు కోర్టు ధిక్కరణ తాఖీదులుజారీ చేసింది. అనిల్‌ అంబానీతో సహా అందరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీన్ని జనవరి 7న సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. అందులో.. ‘ధిక్కరణకు పాల్పడిన వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు’ అని ఉంది. ఈ విషయాన్ని ఎరిక్సన్‌ ప్రతినిధులు, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే జస్టిస్‌ నారిమన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెబ్‌సైట్లో ఉన్న తప్పుడు తీర్పుపై ఆశ్చర్యానికి గురైన జస్టిస్‌ నారిమన్‌ వెంటనే దాన్ని సరిచేయించారు. అనంతరం దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణలో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు అని తేలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos