హైదరాబాద్: జెర్డావ్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో పాటు ఈ సంస్థ పేరు కూడా మారింది. జెర్డావ్ స్టీల్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో ఏటా 3 లక్షల టన్నుల స్టీలు తయారు చేసే ప్లాంటు ఉంది. వాహన పరిశ్రమ, సైన్యం, రైల్వేల అవసరాలకు అనువైన స్పెషాలిటీ స్టీలు ఈ ప్లాంటులో తయారు చేస్తారు. జెర్డావ్ స్టీల్ ఇండియా, స్పెయిన్‌లోని జెర్డావ్ హంగ్రియా కేఎఫ్‌టీ అనే సంస్థకు అనుబంధ సంస్థ. ఈ స్పెయిన్ సంస్థ అసలు యజమాని బ్రెజిల్‌లోని జెర్డావ్ ఎస్‌ఏ., అనే సంస్థ. ఈ మాతృ సంస్థ గత ఏడాది అక్టోబరులో స్పెయిన్ సబ్సిడరీని, దాని భారతీయ అనుబంధ సంస్థను హాంకాంగ్, సింగపూర్, షాంఘై, ముంబయి నగరాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఏడీవీ పార్టనర్స్ సారధ్యంలోని రెండు పీఈ (ప్రైవేట్ ఈక్విటీ) ఫండ్స్‌కు విక్రయించింది. దీంతో యాజమాన్యం మారిపోయింది. తత్ఫలితంగా ఇప్పుడు సంస్థ పేరును అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని మార్చారు. కొత్త యాజమాన్యం సారధ్యంలో కంపెనీ మరింత ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సంస్థలో 1600 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, అనంతపురం పరిసరాల్లో విస్తరిస్తున్న వాహన పరిశ్రమకు అనువైన సరికొత్త స్టీలు ఉత్పత్తులపై దృష్టి సారించినట్లు వివరించారు.