అరెస్టయిన వారిలో 129 మంది భారతీయులు

అరెస్టయిన వారిలో 129 మంది భారతీయులు

వాషింగ్టన్‌: అమెరికాలో నకిలీ విద్యార్థి వీసా రాకెట్‌ కలకలం సృష్టించింది. విద్యార్థి వీసా ముసుగులో వందల మంది విదేశీయులకు అమెరికాలో అక్రమంగా నివసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించిన 8 మంది దళారులను ఇక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ విద్యార్థి వీసాలతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్న 130 మంది విదేశీయులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. వీరిలో 129 మంది భారతీయులేనని అధికారులు తాజాగా వెల్లడించారు.మరోవైపు అరెస్టయిన విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికాలోని భారత ఎంబసీ 24 గంటల పాటు పనిచేసే హాట్‌లైన్‌ను తెరిచింది. విద్యార్థులు, వాటి కుటుంబసభ్యులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ఓ నోడల్‌ అధికారిని కూడా నియమించింది. టెక్సాస్‌లోని డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్న భారత విద్యార్థులను అక్కడి భారత కాన్సులేట్‌ అధికారులు కలిశారు. విద్యార్థులకు అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు… అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా అధికారులు ప్రారంభించిన ఫార్మింగ్‌టన్‌ యూనివర్శిటీ నకిలీదని విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్ అటార్నీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఫెడరల్‌ అధికారుల తీరును తప్పుబట్టారు. అమెరికాలో కొన్ని యూనివర్శిటీలు తొలి రోజునుంచే కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తాయని, ఇది కూడా అలాంటిదేనని భావించి విద్యార్థులు చేరినట్లు తమకు తెలిసిందని అట్లాంటా అటార్నీ మైఖేల్‌ సోఫో తెలిపారు.విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసేవారిని వలపన్ని పట్టుకోవాలని అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐసీఈలోని అంతర్గత భద్రత దర్యాప్తు (హెచ్‌ఎస్‌ఐ)కు చెందిన ప్రత్యేక ఏజెంట్లు మిషిగన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్‌టన్‌ హిల్స్‌లో ‘ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం’ పేరుతో ఒక నకిలీ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. డెట్రాయిట్‌ ప్రాంతంలోని ఒక చిన్న భవనంలో దీన్ని నిర్వహించారు. వర్సిటీకి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ విషయం తెలియని 8 మంది ఈ వర్సిటీలో 600 మందికిపైగా విద్యార్థులను అక్రమంగా చేర్చేందుకు ప్రయత్నించి, అధికారుల వలలో చిక్కారు. ఈ 8 మందిని అరెస్టు చేసిన అధికారులు గురువారం నాటికి 130 మంది విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos