అమరావతి : అమ్మ
భాష గొప్పదనాన్ని పరిరక్షించి, మరింత
వృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం
ఇక్కడ ఆయన తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్
జరిపారు. వృత్తి ప్రావీణ్యత కోసమే ఆంగ్ల
పరిజ్ఞానం అవసరమంటూ దైనందిన జీవనంలో అమ్మ భాషకు పెద్ద పీటవేయాలని విన్నవించారు. మన
దేశ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే, ఆదర్శప్రాయం, ప్రామాణికమని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి,
సాంప్రదాయాల విశిష్టత చాటి చెప్పాలని కోరారు.
నేరగాళ్లతో
అప్రమత్తం
‘నేరగాళ్ల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారితో ఎంతో ఆప్రమత్తంగా పోరాడాలి.వచ్చే ఎన్నికల్లో నేరగాళ్లతోనే పోటీ పడాల్సి ఉంది. ప్రత్యర్థులు తప్పులు చేసేలా వాళ్లే వ్యూహాల్ని అమలు చేస్తారు. నిరంతరం తస్మాత్ జాగ్రత్త. ప్రత్యర్ధుల నేర చరిత్ర గుర్తుంచుకోండి. హత్యలు, దోపిడీలు, దాడులు వారి సంస్కృతి, ఆధిక్యం కోసం వైసిపి దేనికైనా దిగజారే పార్టీ . వాళ్లే రాద్ధాంతం చేసి దుష్ప్రచారం చేస్తారు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తారు. వీడియో చేస్తారు’ అని దుయ్యబట్టారు. ప్రతి పక్షం తప్పుడు పనులను సమర్ధంగా ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన వైసిపి నేత జగన్, ఆయన కుటుంబం నేరమయ రాజకీయాలకు చిరునామా అని ఆరోపించారు. సామాన్యుల్ని భయపెడుతున్నారని చెప్పారు.
రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చేసిన దుష్ప్రచా రాన్ని ఖండించిన వెంటనే వెనక్కు తగ్గారని చెప్పారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టారని, వినకపోతే విధ్వంసాలకు పాల్పడ్డారు. అరటి తోటలను ధ్వంసం చేసి, చెరకు తోటలు తగులపెట్టారని, పొలాల్లో బోర్లు ధ్వంసం చేశారని ధ్వజ మెత్తారు.
ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. కొత్త తరం ఓటర్లకు ఎన్టీఆర్ గురించి తెలపాలని కోరారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్ర పన్నుతున్నారని, వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని తెలిపేలా ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సినిమాలు తీశారన్నారు.