బెంగళూరు : దేశంలో నిరుద్యోగులకు శుభవార్త. ఈ కామర్స్ బిజినెస్ దిగ్గజం అమెజాన్ త్వరలో 1300 మంది ఉద్యోగులను నియమించనుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువమంది ఉద్యోగులను నియమించాలని అమెజాన్ నిర్ణయించింది. భారతదేశంలో 1300 పోస్టులు, చైనాలో 467, జపాన్ లో 381, ఆస్ట్రేలియాలో 250, సింగపూర్ లో 174, దక్షిణ కొరియాలో 70 పోస్టులను భర్తీ చేయాలని అమెజాన్ నిర్ణయించింది. భారతదేశంలో అమెజాన్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలుగా ఈ కొత్త రిక్రూట్ మెంట్ చేపట్టనుంది. కొత్త ఉద్యోగుల నియామకం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో చేపట్టాలని అమెజాన్ యోచిస్తోంది. సాప్ట్‌వేర్ అభివృద్ధి, వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్, వెబ్ డెవలప్ మెంట్, సప్లయి చైన్, కాంటెంట్ డెవలప్ మెంట్ విభాగాల్లో నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అమెజాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు.