బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ బీ కే హరి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు పంది రోగం వచ్చిందని ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత ఆయనను ప్రశ్నించిన మీడియాతో కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన మాటలకు చింతించడం లేదన్నారు. జేడీయూ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంప్రదించడం ఆపే వరకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంటుందని మరింత వివాదాస్పదంగా మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వంపై చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తే, ప్రజలు ఆయనను శపిస్తారని, ఆయన మరింత అనారోగ్యానికి గురవుతారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం స్వైన్ ఫ్లూతో అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.