పాట్నా: ఎన్నికల వ్యూహకర్తగా మంచిపేరున్న ప్రశాంత్ కిషోర్‌ను జేడీ(యూ)లోకి తీసుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండుసార్లు తనకు సూచించినట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. పాట్నాలో ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రశాంత్ కిషోర్ జేడీయూలో చేరారు. అనంతరం ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని చేయడం ద్వారా మీ రాజకీయ వారసుడిగా ఆయనను చూస్తున్నారా అని అడిగిన ఓ ప్రశ్నకు నితీష్ సూటిగా సమాధానమిచ్చారు ‘ఆయన మాకేమీ కొత్త కాదు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మాతో కలిసి పనిచేశారు. కొద్దికాలం ఆయన వేరే పనులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూలో చేర్చుకోవాలని కోరింది మరెవరో కాదు. అమిత్‌షానే. రెండు సార్లు నాకు ఈ సూచన చేశారు’ అని నితీష్ చెప్పారు. రాజకీయేతర కుటుంబాల్లో పుట్టి రాజకీయాల్లోకి వచ్చేందుకు నోచుకోని యువతను, వారిలోని ప్రతిభను వెలికితీసే పని ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించామని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పట్ల తనకెంతో వాత్సల్యం ఉందని, అయితే వారసత్వం అనే పదం సరైనది కాదని, ఇదేమీ రాచరికం కాదని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ గురించి మాట్లాడుతూ, ఆయన తనపై పరుషపదజాలం వాడినా ఆయనంటే తనకు ఇష్టమని చెప్పారు. లాలూ విషయమూ అంతేనన్నారు. ఆయనతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత సంబంధాలపై వాటి ప్రభావం లేదన్నారు.