అమరావతి : పుల్వామా దాడిలో అమరులైన ఒక్కొక్క జవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం ఉదయం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. “జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరం. నాగరిక సమాజంలో ప్రాణాలను తీయటం దుర్గార్గం, అత్యంత హేయం. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదం. ఉగ్రవాదాన్ని అణచి వేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మున్ముందు ఇలాంటి ఘోరం జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి వ్యూహాన్ని అనుసరించాలి. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.”అన్నారు. “సైనికుల జీవితాలు వెలకట్టలేనివి.,విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు అందరూ అండగాఉండి , నైతిక స్థైర్యాన్ని అందించడం తక్షణ కర్తవ్యమని” పిలుపునిచ్చారు.