అన్నా హజారే ఆరోగ్యం విషమం

అన్నా హజారే ఆరోగ్యం విషమం

రాలేగావ్ సిద్ధి: కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారంతో ఏడవ రోజుకు చేరుకుంది. ఐదు కిలోలు బరువు తగ్గడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ‘అన్నాజీ ఇంతవరకూ 5.5 కిలోల బరువు కోల్పోయారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం ఆయనకు తెలిపాం. షుగర్ లెవల్ తగ్గిపోయింది. సాధ్యమైనంత త్వరగా నిరాహార దీక్ష విరమించాలని కోరాం’ అని డాక్టర్ ధనంజయ్ పోతె తెలిపారు. సెలైన్ లేదా ఓఆర్ఎస్ తీసుకోవాలని తాము సూచించినప్పటికీ ఆయన నిరాకరిస్తున్నారని, ఇదేవిధంగా నిరాహార దీక్ష సాగిస్తే మూత్రపిండాలు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 81 ఏళ్ల అన్నా హజారే జనవరి 30 నుంచి నిరాహార దీక్ష సాగిస్తున్నారు. కాగా, గ్రామంలో ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకోకుండా హజారే దీక్షలో పాల్గొన్నారని రాలేగావ్ సిద్ధి డిప్యూటీ సర్పంచ్ లంకేష్ తెలిపారు. అన్నాజీ డిమాండ్లు నెరవేరకుంటే గ్రామమంతా ఆత్మాహుతి చేసుకుంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను దీక్ష విరమించేలా చేయాలని, ఇందుకు తమ గ్రామస్థులంతా సిద్ధమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రె, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరీష్ మహాజన్‌లు సోమవారంనాడు అన్నా హజారేను కలిసి నిరాహార దీక్ష విరమింపజేసే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఎలాంటి బలమైన నిర్ణయాలు లేవని, ప్రజలను తప్పుదారి పట్టేంచేలా ఉన్నాయని, తమ దీక్ష కొనసాగుతుందని హజారే తెగేసి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos