చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి నుంచి లోక్‌సభ టిక్కెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తులను అన్నాడీఎంకే పార్టీ ఆహ్వానించింది. దరఖాస్తు ఫీజుగా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ అప్లికేషన్ ఫారాలు అందుబాటులో ఉంటాయని అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్, ముఖ్యమంత్రి కె.పళనిస్వామి సంయుక్తంగా బుధవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, పుదుచ్చేరిలో ఒక లోక్‌సభ స్థానం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 గెలుచుకుంది. బీజేపీతో పొత్తు లేనట్టే….కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఆలోచనను అన్నాడీఎంకే ప్రస్తుతానికి పక్కకు పట్టేసింది. తమిళనాడులో ఎన్నికల ముందు పొత్తులకు బీజేపీ సుముఖమేనంటే ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చినప్పటికీ, కమలనాథులతో పొత్తు కంటే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే బలాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. ‘బీజేపీని మా వీపుపై మోసి తమిళనాడులో వాళ్లు పాదం మోపేందుకు సహకరిస్తామనుకుంటే అంతకంటే పెద్ద జోక్ ఉండదు. పార్టీ పటిష్టత కోసం మేము పనిచేస్తాం. వాళ్లు కూడా సొంతంగానే బలపడాల్సిందే’ అని అన్నాడీఎంకే నేత ఎం.తంబుదురై తెగేసి చెప్పారు. బీజేపీని భుజం మీద మోయడానికి అన్నాడీఎంకే ఏ పాపం చేసిందని ఆయన నిలదీశారు. బీజేపీకి తమిళనాడులో చోటులేదని కూడా వ్యాఖ్యానించారు.