అనుమానమే అసలు కారణం…

  • In Crime
  • February 7, 2019
  • 958 Views

అనుమానంతో ప్రియుడి వేధింపులు…పెళ్లి విషయంలో జాప్యం..తదితర పరిణామాలతో మనస్తాపానికి గురైన బుల్లితెర నటి నాగ ఝాన్సీ హైదరాబాద్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె మృతికి ఆమె ప్రియుడు, విజయవాడకు చెందిన సూర్యతేజ చౌదరే కారణమంటూ ఝాన్సీ తల్లి అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీస్‌ ఠాణా పరిధిలో బుధవారం ఘటన జరిగింది.

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, వడాలి గ్రామానికి చెందిన సువ్వాడ నాగఝాన్సీ అలియాస్‌ ఝాన్సీ (21) సినిమా అవకాశాల కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. కొద్ది నెలలకే టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు దక్కించుకుంది. మా టీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ సీరియల్‌ ఆమెకు గుర్తింపు తేవడంతో ఇక్కడే స్థిరపడింది. ప్రస్తుతం అమీర్‌పేట్‌లోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో ప్లాట్‌ నెంబర్‌ 401లో సోదరుడు దుర్గాప్రసాద్‌తో కలిసి నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ లోపల్నుంచి గడియ పెట్టిఉన్నట్లు గుర్తించాడు. ఎంతసేపు కాలింగ్‌ బెల్‌ కొట్టినా తలుపు తీయకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కిటికి గుండా ఇంట్లోకి వెళ్లాడు. పడక గదిలో ఝాన్సీ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు గుర్తించి పోలీసులకు, 108కు ఫోన్‌ చేశాడు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చి మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పరిచయం… ప్రేమ…అనుమానం
ఝాన్సీకి ఓ స్నేహితురాలి ద్వారా ఏడాది క్రితం విజయవాడకు చెందిన సూర్యతేజ చౌదరి పరిచయమయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ‘పెళ్లయ్యాక సీరియళ్లలో నటించకూడదని’ ప్రియుడు షరతు విధించగా దానికామె అంగీకరించింది. అప్పట్నుంచి నటనకు స్వస్తి పలికింది. అర్నెల్ల క్రితమే పెళ్లి నిర్ణయాన్ని తల్లి సంపూర్ణకు చెప్పింది. సూర్యతేజ తల్లిదండ్రులు అంగీకరిస్తే పెళ్లి చేసేందుకు తనకు అభ్యంతరం లేదని తల్లి చెప్పినట్టు సమాచారం. అప్పట్నుంచి అతను ప్రియురాలి ఇంటికి వచ్చిపోతూ ఉన్నట్టు తెలిసింది.

వేధింపులే కారణమా?
పెళ్లి ప్రతిపాదన తర్వాత ఇతరులతో సంబంధాలున్నాయనే కోణంలో ప్రియుడు నుంచి ఝాన్సీ వేధింపులు ఎదుర్కొన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్య ఇంట్లోనే స్వల్ప ఘర్షణ కూడా జరిగిందని పక్కింటి వారు పోలీసులకు తెలిపారు. ‘‘సూర్యతేజ ఇంటికి రాకపోవడం, పెళ్లి ప్రస్తావన తేకపోవడం వంటి పరిణామాలతో కొంత కాలంగా ఝాన్సీ మానసిక ఒత్తిడికి లోనైంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి రెండు రోజులుగా సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆ బాధే ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పిందని భావిస్తున్నాం. మృతురాలి పడక గదిలో రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. వాటిలోనే సమాచారాన్ని విశ్లేషించి సూర్య వేధించిట్టు తేలిన పక్షంలో అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

వేధింపులే కారణం: ఝాన్సీ తల్లి
సూర్యతేజ వేధింపులతో తన సోదరి తీవ్ర ఒత్తిడికి గురైందని, స్నేహితురాలి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న బ్యూటీపార్లర్‌కు కూడా వెళ్లడం లేదని సోదరుడు దుర్గాప్రసాద్‌ విలేకర్ల ఎదుట వాపోయాడు. అతని వేధింపుల వల్లనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఝాన్సీకి ఇతరులతో సంబంధాలున్నాయని సూర్యతేజ ఆరోపించాడు. ఓ మీడియాకు పంపిన సందేశంలో అతను ఈ మేరకు ఆరోపణలు చేశాడు. ‘పలువురితో ఆమె సన్నిహితంగా ఉన్న ఆధారాలు నా దగ్గరున్నాయి. వాటితో త్వరలో హైదరాబాద్‌ వస్తా’ అని పేర్కొన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos