ముంబయి: అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు నేటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో ఆర్‌కామ్ షేర్లు 48 శాతం విలువ కోల్పోయి రూ.6కు చేరింది. ఆ తర్వాత మెల్లగా పుంజుకొని నష్టాలను తగ్గించుకొన్నాయి. ఉదయం 11.47 గంటల సమయంలో ఆర్‌కామ్ షేరు 37.5శాతం నష్టంతో రూ.7.25 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ 14శాతం, రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ 13శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 10శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 9శాతం, రిలయన్స్ పవర్ 9శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మానేజ్‌మెంట్ 5శాతం వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు రుణ పరిష్కార ప్రణాళిక ప్రతిపాదన సమర్పించనున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తెలిపింది. ప్రస్తుతం కోర్టు వెలుపల అమలు చేస్తున్న ఆస్తుల విక్రయ ప్రణాళిక మాదిరిగానే ఇది ఉంటుందని వెల్లడించింది. దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడానికి అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌కామ్ ఆస్తుల విక్రయానికి 100% రుణదాతల అనుమతి లభించడం సవాలుగా మారింది. కంపెనీ ఆస్తుల విక్రయానికి టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్), టీడీశాట్, పలు కోర్టుల వద్ద న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. ఎన్‌సీఎల్‌టీ 66 శాతం మెజారిటీ నిబంధనతో తమకు 100 శాతం అనుమతులు లభిస్తాయని కంపెనీ భావిస్తోంది.