న్యూఢిల్లీ : అదానీ బొగ్గు గని ప్రాజెక్టు అటవీ హక్కుల చట్టాన్ని (ఎఫ్‌ఆర్‌ఎ) ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ శుక్రవారం పేర్కొన్నారు. ”మధ్యప్రదేశ్‌లోని ధీరౌలిలో బొగ్గు గనుల ప్రాజెక్టు కోసం అదానీ సంస్థ ప్రభుత్వ మరియు అటవీ భూమిలోని చెట్లను నరికివేయడం ప్రారంభించింది. స్టేజ్2 అటవీ అనుమతి లేకుండా మరియు ఎఫ్‌ఆర్‌ఎ, 2006, పెసా, 1996 చట్టాల స్పష్టమైన ఉల్లంఘన. గ్రామస్తులు, ఎస్‌టి వర్గాలు ముఖ్యంగా గిరిజన సమూహం (పివిటిజి) కూడా నిరసన తెలుపుతున్నారు” అని అన్నారు. ”బొగ్గు బ్లాక్ ఐదవ షెడ్యూల్‌లోకి వస్తుందని, ఈ షెడ్యూల్ గిరిజన హక్కులు మరియు స్వపరిపాలన నిబంధనలు రాజ్యాంగబద్ధంగా రక్షించబడతాయి” అని అన్నారు. 2019లో మోడీ ప్రభుత్వం ఈ కేటాయింపును విధించిందని, ఇప్పుడు 2025లో అవసరమైన చట్టపరమైన అనుమతులు లేకుండానే ముందుకు తీసుకువెళ్తోందని మాజీ పర్యావరణ మంత్రి కూడా తెలిపారని అన్నారు. ”మోదానీ తనకు తాను ఒక (ఎఫ్) అటవీ చట్టంగా భావిస్తున్నారని .. అందుకే ఇది జరిగింది” అని జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.”ఈ ప్రాజెక్టు అమలుతో మహువా, టెండు, మందులు, ఇంధన కలప అన్ని కనుమరుగువుతాయి. ఇది ఆదివాసీ వర్గాల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది” అని అన్నారు. ”అడవులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, స్థానిక ఆదివాసీ సమూహాలకు పవిత్రమైనవి. పరిహారం చాలా పేలవమైన ప్రత్యామ్నాయం” అని అన్నారు.