ఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందం కేసులో సహనిందితుడు, దుబాయ్ వ్యాపారి రాజీవ్ సక్సేనాకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.. రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అనారోగ్యంతో బా ధ పడుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిన్న రాజీవ్ సక్సేనా న్యాయస్థానానికి విన్నవించారు. ఈ నెల 22 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లు పటియాలా హౌస్ కోర్టు ప్రకటించింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి వైద్య నివేదిక తీసుకురావాలనీ ఆదేశించింది. రూ.3,600 కోట్ల ఆగస్టా వెస్ట్‌లాండ్ కేసులో రాజీవ్ సక్సేనా రిమాండ్ అవసరం లేదని ఈడీ చెప్పినప్పటికీ ఈ నెల 18 వరకు ఢిల్లీ కోర్టు మంగళవారం ఆయనకు న్యాయ నిర్భంధాన్ని విధించింది. పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సక్సేనా విచారణకు హాజరు కాకపోవటంతో ధర్మాసనం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మరే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్న దశలో మధ్యంతర బెయిల్ మంజూరు కావడం గమనార్హం.