అఖిలేశ్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి… 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు…

అఖిలేశ్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి… 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు…

లక్నో : గోమతి నది అభివృద్ధి పథకంలో అక్రమాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను వెంటాడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం 4 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో, నోయిడా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సాక్ష్యాధారాలు, దస్తావేజులను పరిశీలిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గోమతి నది సుందరీకరణ పనుల పథకంపై దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ గత మార్చిలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ కూడా గోమతి నది అభివృద్ధి ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కమిటీ తన నివేదికను 2017 మే 16న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు అదే సంవత్సరం జూన్ 19న కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos