భర్తను చెప్పుతో చితకబాదిన భార్య

లఖ్‌నవ్‌: ఉత్తరప్రదేశ్‌లో కోర్టు బయట భర్తను ఓ మహిళ చెప్పుతో చితకబాదింది. భరణం కేసు విచారణకు హాజరైన ఆమెకు భర్త కోర్టు బయటే మూడుసార్లు తలాక్‌  చెప్పాడు. అనంతరం దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు ఆత్మరక్షణ కోసం భర్తపై చెప్పుతో దాడి చేసింది . ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘2018లో నాకు వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భర్త కొట్టేవాడు. అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. నాకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారు పుట్టాక నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. అప్పుడు కోర్టు సాయం కోరడం తప్ప నాకు వేరే మార్గం లేదు. భరణం కోసం కేసు పెట్టాను. ఆర్థిక సాయం కోరుతూ దావా వేశా. దీంతో పిల్లలను నా దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్లిపోయాడు’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.ఇక ఈ కేసుపై రాంపూర్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి హాజరుకాగా, ఆమె భర్త తన తండ్రితో కలిసి కోర్టుకు వచ్చాడు. విచారణ అనంతరం బాధితురాలు కోర్టు నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో భర్త, ఆమె మామ ఇద్దరూ బాధితురాలిని వెంబడించి దుర్భాషలాడారు. కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో, మామ ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే మూడుసార్లు ‘తలాక్..’ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించింది. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తపై దాడి చేసినట్లు తెలిపింది.‘నాకు వేరే మార్గం కనిపించలేదు. మొదట వాళ్లే నన్ను కొట్టారు. అందుకే ఆత్మరక్షణ కోసం వారిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. నా భర్త, మామను వెంటాడి చెప్పుతో కొట్టాను. నా పిల్లలను దూరం చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు తలాక్‌ చెప్పి నాపై దాడి చేశాడు. నేను ఎలా సహిస్తాను..? నాకు న్యాయం కావాలి. నా ఇద్దరు కూతుళ్లను నాకు అప్పగించాలి. వారికి భరణంతో పాటు మేం అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలి. నిందితులకు కఠిన శిక్ష పడాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో కాస్త గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos