ముంబై:ప్రముఖ చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో మరోసారి జాప్యం చేస్తోంది. రూ.55,000 వరకు వేతనం కలిగిన జూనియర్ ఉద్యోగులు ఆగస్టు నెలకు సంబంధించి జీతం టైమ్‌కు అందుకోగా.. సీరియర్ సిబ్బంది ఆలస్యంగా జీతాలు అందుకుంటున్నట్లు సమాచారం. కొందరికీ ఇప్పటికీ జీతాలు అందలేదని తెలిసింది. సీనియర్ సిబ్బంది ముఖ్యంగా అసిస్టెంట్ మేనేజర్ స్థాయి, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారికి కనీసం 10-15 రోజులు ఆలస్యంగా వేతనాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గత ఆర్థిక సంవత్సరం స్పైస్‌జెట్ వార్షిక నివేదిక ప్రకారం, సంస్థలో 4,894 మంది శాశ్వత సిబ్బందితో సహా మొత్తం 6,484 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, గతంలో ఈ సంస్థ అనేకసార్లు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించ డంలో జాప్యం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.