శ్రీనగర్ : భారత్-ఇండియా పేరు వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా మోదీ సర్కార్కు సవాల్ విసిరారు. దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతు పలకరని నేషనల్ కాన్ఫరెన్స్ నేత స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదని అన్నారు. కేంద్రానికి అంత ధైర్యం ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని, మీకు ఎవరు మద్దతిస్తారో తాము చూస్తామని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంతో పేరు మార్పు వ్యవహారంపై ఊహాగానాలు సాగుతున్నాయి.విపక్ష కూటమి ఇండియా పేరుతో ముందుకు రావడంతోనే కేంద్రం ఈ డ్రామాకు తెరతీసిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ దిగ్గజ నేత ఫరూక్ అబ్దుల్లా సైతం ఇండియా పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా రాజ్యాంగాన్నిచదవాలని ఆయన హితవు పలికారు. భారత్, ఇండియా రెండూ ఒకటేనని రాజ్యాంగంలో స్పష్టంగా ప్రస్తావించారని చెప్పారు.