హఠాత్తుగా ఆగిపోయిన మోనో రైలు.. ప్రయాణికులు సేఫ్‌

హఠాత్తుగా ఆగిపోయిన మోనో రైలు.. ప్రయాణికులు సేఫ్‌

ముంబై: ముంబైలో మోనోరైలు సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. రైలు సోమవారం ఉదయం హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  మోనో రైలు సోమవారం ఉదయం 7:45 గంటల సమయంలో వడాలా  వైపు వెళ్తోంది. అయితే, సాంకేతిక సమస్య  కారణంగా రైలు హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అందులోని వారందరినీ సురక్షితంగా కాపాడారు. చెంబూర్ నుంచి వచ్చిన మరో మోనోరైలులో వారిని సురక్షితంగా తరలించారు. విద్యుత్‌ సరఫరాలో సమస్య కారణంగానే అంతరాయం ఏర్పడినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. మోనో రైలును కప్లింగ్ ద్వారా అక్కడి నుంచి తొలగించనున్నారు. గత నెలలో కూడా ఓ మోనో రైల్లో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. నగరంలోని ఆచార్య అత్రే చౌక్ స్టేషన్‌లో ఓ మోనో రైలు దాదాపు 12 నిమిషాల పాటు నిలిచిపోయింది. ముంబైలో మోనోరైల్ సేవలు 2014 నుంచి కొనసాగుతున్నాయి. ఈ రైలు ముంబైలోని వడాలా నుండి చెంబూర్, సంత్ గాడ్గే మహారాజ్ చౌక్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల మార్గంలో నడుస్తోంది. అయితే, ఇటీవలే కాలంలో ఈ రైలు సేవల్లో అంతరాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos