హైదరాబాద్ : ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించేసినా, వైవీఎస్ చౌదరి కావాలనే తనపై చెక్ బౌన్స్ కేసు వేశారని నటుడు మోహన్ బాబు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడం, తదనంతరం ఆయనకు బెయిల్ మంజూరు కావడం లాంటి పరిణామాల అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2009లో సలీం సినిమా తీస్తున్నప్పుడే చౌదరికి మొత్తం పారితోషికాన్ని చెల్లించేశామని వెల్లడించారు. తర్వాత తమ బ్యానర్‌లోనే మరో సినిమా చేయడానికి రూ.40 లక్షలకు చెక్ ఇచ్చామని పేర్కొన్నారు. సలీం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తదుపరి సినిమా వద్దనుకున్నామని వెల్లడించారు. కనుక చెక్‌ను బ్యాంకులో వేయొద్దని చెప్పాక కూడా, అలా చేసి చౌదరి కోర్టును తప్పు దోవ పట్టించారని తెలిపారు. ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేస్తున్నామని, కొన్ని వార్తా ఛానెల్స్‌లో తమపై వస్తున్న ఆరోపణలు శుద్ధ తప్పని ఆయన పేర్కొన్నారు.