హైదరాబాద్:చెల్లని చెక్ వితరణ చేసిన నేరానికి సినీ నటుడు, వైకాపా నేత మోహన్బాబుకు ఇక్కడి ఎర్ర మంజిల్ కోర్టు మంగళవారం ఏడాది కారాగార శిక్ష విధించింది. తనకు మోహన్ బాబు ఇచ్చిన రూ.40.50 లక్షల చెక్ చెల్లనందున నగదు మొత్తాన్ని ఇప్పించాలని కోరుతూ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి 2010లో న్యాయస్థానంలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. మోహన్ బాబు ఆధిపత్యంలోని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించిన –సలీం చిత్రానికి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించారు. సినిమా నిర్మాణం జరిగినపుడు మోహన్బాబు తనకు ఇచ్చిన రూ.40.50లక్షల చెక్కు నగదుగా మారకపోవడంతో చౌదరి న్యాయస్థానం తలుపులు తట్టారు. ఈ వ్యాజ్యంలో తొలి ముద్దాయి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కు రూ.10 వేల జరిమానా, రెండో ముద్దాయి మోహన్బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది. మోహన్బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మోహన్బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు.