లఖింపుర్ ఖేరి ఘటన కుట్ర

లఖింపుర్ ఖేరి ఘటన కుట్ర

లఖ్నవూ: లఖింపుర్ ఖేరిలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. పక్కా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని, నిర్లక్ష్యంతో కాదని తేల్చి చెప్పింది. దరిమిలా నిందితులపై హత్యాయత్నం అభియోగాలు మోపేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం)ను సిట్ అధికారి విద్యారామ్ దివాకర్ అభ్యర్థించారు. ప్రస్తుతం నిందితులపై మోపిన ‘నిర్లక్ష్యంగా నేరానికి పాల్పడిన’ అభియోగాలు (సెక్షన్ 279, 338, 304ఏ) స్థానంలో సెక్షన్ 307(హత్యాయత్నం), సెక్షన్ 326(ప్రమాదకరమైన ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం), సెక్షన్ 34ను చేర్చాలని మేజిస్ట్రేట్ను కోరారు. ప్రధాన నిందితుడు ఆశిశ్ మిశ్ర బెయిల్ వినతికి రెండు వారాల్లోగా స్పందించాలని అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత అక్టోబర్ 3న జరిగిన లఖింపుర్ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న రైతుల పైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిశ్ మిశ్ర కారు దూసుకెళ్లింది. కారు ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు చనిపోయారు. ఆశిశ్ మిశ్ర సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు ప్రస్తుతం లఖింపుర్ ఖేరి జిల్లా కారాగారంలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos