బెంగళూరు: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) కలిసి పోటీ చేస్తాయని, జేడీ(ఎస్) నాలుగు లోక్సభ స్థానాల్లో, బీజేపీ 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని.. శుక్రవారం ఉదయం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కర్ణాటక మరో మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత కుమారస్వామి స్పందించారు. యడ్యూరప్ప వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. ‘శుక్రవారం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. ఇప్పటివరకు బీజేపీ-జేడీ(ఎస్) మధ్య లోక్సభ సీట్ల పంపకంపై గానీ, పొత్తుపై గానీ ఎలాంటి చర్చ జరగలేదు. తాము స్నేహపూర్వకంగా రెండు, మూడు సార్లు కలిశాం. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజల ముందుకు వెళ్లడానికి ముందే తాము కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రజలను లూటీ చేస్తున్నందున తాము ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు ప్రత్యామ్నాయం అవసరమైనప్పుడు 2006లో తాను బీజేపీతో చేతులు కలిపాను. నాటి నా 20 నెలల పాలనతోనే నాకు మంచి పేరు వచ్చింది’ అని కుమారస్వామి పేర్కొన్నారు.