మణిపూర్‌ ఘర్షణలకు బీజేపీ రాజకీయ అండ

మణిపూర్‌ ఘర్షణలకు బీజేపీ రాజకీయ అండ

హైదరాబాద్ : సహజ సంపద, వనరులు లూటీ చేయాలనే కార్పొరేట్ల దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ అండదండలే మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం ఆరోపించారు. బీజేపీ కుటిల, సంకుచిత రాజకీయాలకు మణిపూర్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని, అక్కడ హింసకు ముగింపు ఎప్పుడో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు సి.రాఘవాచారి జయంతిని పురస్కరించుకొని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం నీలం రాజశేఖర రెడ్డి పరిశోధన కేంద్రం, సీఆర్ ఫౌండేషన్, రాఘవాచారి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ‘మణిపూర్ ఒక రాజకీయ విశ్లేషణ’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. మణిపూర్లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ అనేక దేశాల్లో పర్యటించారే తప్ప మణిపూర్ మాత్రం వెళ్లలేదన్నారు. అక్కడ జరుగుతున్నది కేవలం ఆర్థిక, సాంస్కృతిక, జాతుల సంఘర్షణ మాత్రమే కాదని, వీటి వెనుక కార్పొరేట్ శక్తుల ప్రమేయం, ధనదాహం ఉందని ఆరోపించారు. మణిపూర్ కొండల్లోని అపార ఖనిజ సంపదపై అదానీ కన్నుపడిందని, ఆయనకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వాలు జాతుల ఘర్షణకు తెరలేపాయన్నారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న మణిపూర్లో ఘర్షణ మంటలు ఆరడంలేదని విమర్శించారు. సదస్సులో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివా్సరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఐడీపీడీ ఉపాధ్యక్షులు డాక్టర్ రజిని, మాజీ ఎమ్మెల్సీ జె.చంద్రశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos