ప్రభుత్వ కార్యాలయాలు అందులో పని చేసే అధికారులంటే ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తుకు వచ్చేది లంచం,అవినీతి,నిర్లక్ష్యం పదాలే.ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ అవినీతి తారాస్థాయికి చేరుకోవడంతో నిజాయితీగా పని చేసే అధికారులను సైతం అవినీతి అధికారుల గాటిలో కట్టేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ అధికారి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ”నేను లంచం తీసుకోను” అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన బోర్డుని తన చాంబర్ లో పెట్టుకున్నారు ఆ అధికారి.వివరాల్లోకి వెళితే.. ఆ ప్రభుత్వ అధికారి పేరు పోడేటి అశోక్. కరీంనగర్ విద్యుత్ శాఖలో సర్కిల్ ఆఫీస్ లో కమర్షియల్ ఏడీఈ(అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్) గా పనిచేస్తున్నారు. ”నేను లంచం తీసుకోను” అని ఆఫీస్ లో బోర్డు పెట్టించారు. ఎందుకిలా చేశారు అని అడిగితే.. అధికారులు అందరూ లంచాలు తీసుకునే వారు అంటే తాను అంగీకరించనని నిజాయితీగా పని చేసే వాళ్లు కూడా ఉంటారని తెలియజేసే ఉద్దేశంతో ‘నేను లంచం తీసుకోను’ అంటూ పెద్ద అక్షరాలతో బోర్డు రాయించానని తెలిపారు..