న్యూ ఢిల్లీ : దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగబద్ధత ఉన్నందున మొత్తం చట్టంపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే వక్ఫ్ చట్టంలోని పలు నిబంధనల అమలుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని అనుసరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్‌ను క్రియేట్ చేయగలరనే నిబంధన కూడా స్టే ఇచ్చిన జాబితాలో ఉంది. సోమవారం రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ చట్టంలోని అన్ని సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రాథమిక అభియోగాలపై తాము విచారణ జరిపామని, ఆ మొత్తం చట్టంపై స్టే విధించేంతగా పరిస్థితేం కనిపించ లేదన్నారు.