శ్రీకాకుళం : పలాసలో యుటిఎఫ్ రణభేరి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పలువురు యుటిఎఫ్ నేతలను, ఉపాధ్యాయులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. సోమవారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమాన్ని కాశీబుగ్గ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ, నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు అనుమతి లేదని కాశీబుగ్గ డిఎస్పీ వి.వెంకట అప్పారావు, సిఐ సూర్యనారాయణ చెప్పడంతో తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చివరకు పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధం అవుతున్నారని గుర్తించి ఉపాధ్యాయులు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వరరావు, కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మడి శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు లండ.బాబూరావు, గొంటి గిరిధర్, ఆర్.దమయంతి, ధనలక్ష్మి స్వర్ణ కుమారి, టి.జయరాం, ఎస్ వి.రమణ, కె.రమేష్, ఎల్.వెంకట చలం, బల్ల.చిట్టిబాబు, చౌదరి రవీంద్రలను బలవంతంగా అరెస్టులు చేసి కాశీబుగ్గ పోలీసు స్టేషన్ కు తరలించారు.