జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్‌ హోమ్స్‌

జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్‌ హోమ్స్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెగ్గర్స్‌ హోమ్స్‌ను దాతృత్వ సంస్థలుగా ప్రభుత్వాలు నడుపుతున్నాయని విమర్శించింది. ఇలాంటి హోమ్స్‌ను వ్యక్తి పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి, సమాజంలో తిరిగి విలీనం చేసే కేంద్రాలుగా భావించాలని కోర్టు స్పష్టం చేసింది. బెగ్గర్స్‌ హోమ్స్‌లో ‘అధిక రద్దీ, అపరిశుభ్ర పరిస్థితులు, ఏకపక్షం లేదా అసంకల్పిత నిర్బంధం, వైద్య చికిత్స నిరాకరణ, మానసిక-శారీరక అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు, జైలు లాంటి వాతావరణం’ వంటివి కేవలం విధాన వైఫల్యం కాదని, రాజ్యంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు)ను ఉల్లంగించడమేని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బెగ్గర్స్‌ హోమ్స్‌ నిర్వహణను మెరుగుపర్చాలని దాఖలైన పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ విషయాలను వెల్లడించింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనం ఈ నెల 12న తీర్పును వెలువరించింది. ఆదివారం తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చింది. నిరుపేదలు, జైళ్లలో ఖైదీలకు అందే ప్రాథమిక రాజ్యాంగ రక్షణలను కూడా బిచ్చగాళ్లు కోల్పోతున్నారని తీర్పులో కోర్టు పేర్కొంది. బెగ్గర్స్‌్‌ హోమ్స్‌ రాజ్యాంగబద్ధమైన ట్రస్ట్‌ అని, వీటి ద్వారా అత్యంత దుర్బల వర్గాలకు అధిక రక్షణ, గౌరవం, ఆరోగ్యం, ఆశ్రయం, గోప్యత, మానవీయ ఓదార్పు వంటి హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుందని కోర్టు తెలిపింది. ఇవి సమగ్ర పునరావాస సేవలతో నిండిన స్వభావంతో ఉండాలని, సామాజిక న్యాయం లభించే స్థలాలుగా గుర్తించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బెగ్గర్స్‌ హోమ్స్‌లో ఆరోగ్య పరీక్షలు, ఆడిట్‌లను నిర్వహించాలని ఆదేశించింది. బెగ్గర్స్‌ హోమ్‌లో ప్రవేశం పొందిన వ్యక్తులకు 24 గంటలలోపు తప్పనిసరి తనిఖీలు, ఈ గృహాలలో అందించే ఆహారం యొక్క పోషక ప్రమాణాలను ద్రువీకరించడానికి అర్హత కలిగిన డైటీషియన్‌, కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి మౌలిక సదుపాయాలను సమీక్షించడం, రద్దీ- అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి అధికారులు, వృత్తి శిక్షణ లభ్యత, మహిళలు లేదా పిల్లలకు గోప్యత, భద్రత, విద్య- కౌన్సెలింగ్‌ను కల్పించడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos